మామకు మామ" ఉత్పలమాల:- "మామను సంహరించి,యొక మామను గర్వమడంచి య

"మామకు మామ"
                      
ఉత్పలమాల:-
"మామను సంహరించి,యొక మామను 
                                గర్వమడంచి య న్నిశా
మామను రాజుఁజేసి,యొక మామ తనూజున
                                కాత్మబంధువై
మామకుఁగన్నులిచ్చి,సుతు మన్మధనింతికిఁ
                                దానె మామయై,
మామకు మామయైన పరమాత్ముడు మీకుఁ
                             బ్రసన్నుఁడయ్యెడున్"!
భావం:-నారాయణుడు కృష్ణావతారంలో తన
మేనమామ అయిన కంసుణ్ణి సంహరించాడు.
రామావతారంలో సేతువు నిర్మాణ సమయంలో
సముద్రుడి గర్వం అణచాడు.నిశీధిపతియైన 
చందమామను 'రాజు'గా పిలిచాడు.మామ
కొడుకైన అర్జునుడికి ఆత్మబంధువుగా తోడు
నిలిచాడు.మరో మామ ధృతరాష్ట్రుడికి
విశ్వరూప సందర్శన వేళ దృష్టిని ప్రసాదించాడు.
రతీదేవికి (తన కొడుకు భార్య)తానే మామ
అయ్యాడు.సాగర ప్రభవ లక్ష్మిని పెళ్ళాడి
సముద్రుడికి అల్లుడయ్యాడు.విష్ణుమూర్తి తన
పాద్యోద్భవమైన గంగను సాగరుడికి ఒసగి
మామకే మామ అయ్యాడు. ఇంతటి స్వామి
మిమ్మల్ని కృపతో చూచుగాక అన్నది ఆశీర్వాదం.
"మామ"అన్ని ఒక్క మాటతో ఆ అజ్ఞాత కవి
ఎవరో గాని మాయ చేశాడు.
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు
                మునిపల్లి.

Post a Comment

0 Comments